Thursday, November 21, 2024
spot_img
Homeఅంతర్జాతీయEDIT PAGEఅమ్మ ప్రేమకు వెలకట్టగలమా.?

అమ్మ ప్రేమకు వెలకట్టగలమా.?

ఒక ఉరిలో ముగ్గురు సభ్యులు గల కుటుంబం ఉండేది. తల్లీ, కొడుకు, కూతురు. పిల్లలు కాస్త చిన్నగా ఉన్నప్పుడే తండ్రి కన్ను మూశాడు. తల్లే పిల్లలిద్దరినీ అన్నీ తానే అయి, పెంచింది. రెక్కలు ముక్కలు చేసుకొని వారిని సాకింది. విద్యాబుధ్ధులు చెప్పించింది. అమ్మాయికి పెళ్ళి చేసి అత్తారింటికి పంపింది. కొడుకు చదువు పూర్తయిన తరువాత కొడుక్కి కూడా పెళ్ళి చేసింది. కొడుకూ కోడలితో కలిసి కొన్నాళ్ళు జీవితం పరవాలేదన్నట్లుగా సాగింది. కాని కొద్ది నెలల్లోనే కోడలి బుధ్ధి బయట పడి, అత్తగారంటే అసలు గిట్టని పరిస్థితి ఏర్పడింది. కొన్నాళ్ళకు తనే తెలుసుకుంటుందిలే అని ఆతల్లి సర్దుకుపోయేది. కాని కోడలిలో ఏమాత్రం మార్పు రాకపోగా వేధించడం మొదలు పెట్టింది. అయిందానికీ, కానిదానికీ సూటి పోటి మాటలు అనడం, మళ్ళీ భర్తకు పిర్యాదు చెయ్యడం పరిపాటి అయిపోయింది. తల్లి కూడా ఉన్నదున్నట్లు కొడుక్కి చెప్పి., కొన్నాళ్ళకు అంతా సర్దుకుంటుంది లేరా.. అని రాజీ ధోరణిలో మాట్లాడేది. తల్లి తప్పేమీ లేదని కొడుక్కి తెలిసినా, భార్యపై ప్రేమతో తనను ఏమీ అనేవాడుకాదు. చివరికి సమస్య తీవ్రరూపం దాల్చింది. ః నేను కావాలో, మీ అమ్మ కావాలో తేల్చుకో ..ః అంటూ భార్య హెచ్చరిక జారీ చేసింది. ఒకరోజు కొడుకు తల్లి దగ్గరికొచ్చి, ః.. అమ్మా.. ఇక మీ ఇద్దరి మధ్య పొసిగే సూచనలు కనబడడం లేదు..ః అన్నాడు చిన్నగా నీళ్ళు నలుముతూ..
తల్లి తనయుడి వైపు తలెత్తి చూస్తూ.. ః మరేంచేద్దామనుకుంటున్నావురా.?ః అంది.
ః.. అమ్మా.. నువ్వేమనుకోనంటే ఒక మాట చెబుతా.ః అన్నాడు కొడుకు.
ః సరే చెప్పు..ః అంది తల్లి
ః నువ్వు వేరుగా ఉండడమే సమస్యకు పరిష్కారం.ః అన్నాడు కొడుకు.
ఈ మాటలకు తల్లికి గుండెల్లో అగ్ని పర్వతం బద్దలైన అనుభూతి కలిగింది.
ః.. అమ్మా.. నీకేమీ ఇబ్బంది ఉండదు..వేరే ఇంట్లో ఉన్నా పర్లేదు.. లేదా ఆశ్రమంలో ఉన్నా పర్లేదు. ఆఖర్చంతా నేను భరిస్తాను. రోజుకు ఎంత ఖర్చవుతుందో చెబితే నేనది చెల్లించేస్తాను.ః అన్నాడు కొడుకు.
కొద్దిసేపటి మౌనం తరువాత, బాధను దిగమింగుతూ.. ః.. సరే .. నాక్కాస్త సమయం ఇవ్వు.. ఆలోచించుకొని చెబుతాను..ః అన్నది తల్లి..
సరే.. ఇప్పుడే తొందర లేదులే.. ఆలోచించుకో.. అని చెప్పి కొడుకు వెళ్ళిపోయాడు.
ఆరోజు రాత్రి కొడుకు నిద్రపోతుండగా తల్లి వెళ్ళి, గ్లాసెడు నీళ్ళుపక్కపై పోసింది. కొడుకు దిగ్గున లేచి కూర్చున్నాడు.. అమ్మా.. ఏమిటిది.? కనబడడం లేదా.? అన్నాడు కాస్త దురుసుగా.. ః లేదులేరా.. చెయ్యిజారి పోయింది.ః అని పక్కబట్టలు తీసి తడిని తుడిచేసింది. సరేలే.. అంటూ గునుస్తూ పడుకున్నాడు..
మళ్ళీ రెండవరోజు చెంబెడు చల్లని నీళ్ళుకొడుకు పక్కపై కుమ్మరించింది. ఈసారి కొడుకు కోపం నషాళానికంటింది. తల్లని కూడా చూడకుండా చెడామడా తిట్టిపోశాడు.
ః.. అయ్యో.. ఆగు నాన్నా.. అలా తిట్టకు.. లెక్క కోసమే పోశాను..ః అన్నతి తల్లి
ఏమిటి.. లెక్క.. చన్నీళ్ళు కుమ్మరించి లెక్కేంటి..లెక్కా.. అంటూ మండి పడ్డాడు.
అవును బాబూ.. రోజుకు ఎంతవుతుందో చెప్పమన్నావుగదా.. ఇది మొదటిరోజు లెక్కే.. ఒక్కరోజు లెక్కకే నువ్వింతలా చిరాకు పడితే ఎలా.?
ఇంకా లెక్క తియ్యాలికదా.. ఎన్ని నిద్రలేని రాత్రులో.., నువ్వు ఒకటికి, రెంటికి పోసినప్పుడు బట్టలేకాదు, పక్కకూడా ముద్ద ముద్దయిపోతే, వెచ్చని బట్టల్లో నిన్ను నిద్రపుచ్చి తడి బట్టల్లో ముడుచుకున్న లెక్కలు … ఇంకా ఏదో.. అంటుండగానే..
కొడుక్కి విషయం అర్ధమైపోయింది. అమ్మా.. నన్ను క్షమించు.. అంటూ బోరున విలపిస్తూతల్లి కాళ్ళపై పడి చుట్టేశాడు చంటి పిల్లాడిలా.. అందుకే తల్లి రుణం ఏరూపంలోనూ తీర్చుకోలేనిది అన్నారు ముహమ్మద్ ప్రవక్త మహనీయులు. తల్లిదండ్రులు పిల్లల బాల్యంలో ఏవిధంగా కంటి పాపలా సాకి ఇంతవాళ్ళను చేశారో, అలాంటి ప్రేమ మూర్తులను మరిచిపోయిన వారికి మోక్షం ఉండదన్నారు. తల్లి పాదాల క్రింద స్వర్గం ఉందని, తండ్రి స్వర్గానికి సింహద్వారమని తల్లిదండ్రుల ప్రాముఖ్యతను వివరించారు ప్రవక్త మహనీయులు. వారిని ప్రేమించాలని, వారి మనసు కష్టపెట్టకూడదని, వారి బాగోగులు చూసుకోవాలని, వారికి సేవలు చెయ్యాలని, అన్ని విషయాల్లో వారిని కనిపెట్టుకొని ఉంటూ వారి ఆశీర్వాదం పొందాలని ఆయన ఉపదేశించారు. కనుక ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. తల్లిదండ్రులు సంతోషంగా ఉంటేనే దేవుడు సంతోషిస్తాడు. వారిని పట్టించుకోకుడా ఎంత సమాజ సేవ చేసినా, ఎన్ని ప్రార్ధనలు, పూజలు, వ్రతాలు చేసినా, ఎన్ని సత్కార్యాలు ఆచరించినా, ఎన్ని ఘనకార్యాలు వెలగ బెట్టినా దైవం వాటిని స్వీకరించడు.

 ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular