శేరిలింగంపల్లి-నవభూమి ప్రతినిధి: చేవెళ్ల లోక్ సభ స్థానం నుండి మాజీ ఎంపీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అయిన సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డిపై ఒక లక్ష 79వేల 021 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. రెండవ స్థానంలో నిలిచిన గడ్డం రంజిత్ రెడ్డి ఆరు లక్షల 36వేల 985 ఓట్లు సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఒక లక్ష 78వేల 968 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల లోక్ సభ స్థానంలో బీఆర్ఎస్ గెలిచినప్పటికీ ఈసారి అత్యంత దారుణంగా ఓడిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.
మొదటి రౌండ్ నుండి ఆధిక్యం సాధించిన బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి చివరి వరకు అదే సరళిని అప్రతిహతంగా కొనసాగించారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 1,67,656 ఓట్లు రాగా 11,365 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి 6,30,861 ఓట్లు రాగా 6,124 పోస్టల్ బ్యాలెట్లు సాధించారు. 1,77,540 ఓట్లతో మూడో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థికి 1428 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పొందారు. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో భారీ సంఖ్యలో మొత్తం 19,397 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి. 110 ఓట్లు చల్లనివి కాగా 221 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రిజెక్ట్ అయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పటికీ అధికార పార్టీ అభ్యర్థి ఓటమి చవిచూడంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులకు మళ్లీ చేదు అనుభవమే మిగిలింది. ఈ ఓటమిని తాను అంగీకరిస్తున్నారని గడ్డం రంజిత్ రెడ్డి ఒప్పుకుంటూ గెలిచిన బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.
శేరిలింగంపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి మూడో స్థానానికి పరిమితమైనప్పటికీ ఎంపీ అభ్యర్థి గెలవడంతో కమలనాథుల్లో కొత్త ఉత్సాహం ఏర్పడింది. బీఆర్ఎస్ భారీ ఓటమిని చవిచూడడంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో గులాబీ శ్రేణుల్లో నిస్తేజం నెలకొంది.