శేరిలింగంపల్లి-నవభూమి ప్రతినిధి: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్ట మొదటి దక్షిణ భారత వైద్యుడిగా ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కంది చరిత్ర సృష్టించారు. భారతదేశం తరపున ఎవరెస్టు ఎక్కిన పర్వతారోహకులలో మూడో వైద్యుడు కావడం విశేషం. ప్రఖ్యాత బూట్స్, క్రాంపన్స్ ఎక్స్‌పెడిషన్ సంస్థ సహకారంతో ఏప్రిల్ 7న తన యాత్రను ప్రారంభించిన డా.కంది మే 23వ తేదీన విజయవంతంగా పూర్తి చేశారు.
డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో 2009లో ఎంబిబిఎస్ పూర్తి చేసిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కంది 2013లో మమతా మెడికల్ కాలేజీలో ఎమ్మెస్ ఆర్థోపెడిక్, 2017లో యూఎస్ఏఐఎంలో ఎంసిహెచ్ ఆర్థోపెడిక్స్ పూర్తి చేశారు.
డా. కంది నేపాల్ లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడంతో పాటు ఇంతకు ముందు రష్యాలోని మౌంట్ ఎల్బ్రెస్, ఆస్ట్రేలియాలోని మౌంట్ కోస్యుజ్కో, టాంజానియాలోని మౌంట్ కిలిమంజారో, అర్జెంటీనాలోని మౌంట్ అకాంకాగ్వా పర్వతాలను అధిరోహించి చరిత్ర సృష్టించారు. అతని అద్భుతమైన ఫీట్ అతని శారీరక దృఢత్వానికి, మనోధైర్యానికి, సంకల్ప బలానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ చారిత్రక ఘట్టం అసంఖ్యాక ఔత్సాహిక అధిరోహకులు, వైద్య నిపుణులకు ప్రేరణగా నిలిచింది. కఠినమైన సాహసయాత్రగా పేరుగాంచిన ఈ ఎవరెస్టు పర్వతారోహణలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కంది ప్రమాదకరమైన భూభాగాలు, ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులకు ఎదురొడ్డి అత్యంత ఎత్తైన ప్రదేశాలలో ప్రయాణం చేశారు. ఆర్థోపెడిక్ డాక్టర్‌గా తన కెరీర్‌ను మెడికల్ ఎక్సలెన్స్ ద్వారా తన రోగుల జీవితాలను మెరుగుపరచడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఎవరెస్ట్‌పై అతని విజయం తన వృత్తిపరమైన, వ్యక్తిగత ప్రయత్నాలతో సరిహద్దులను అధిగమించడానికి, తన గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి, అతని నిబద్ధతకు గీటురాయిగా నిలిచింది.
డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కంది సాధించిన ఈ అరుదైన విజయం పట్ల వైద్యులు, పర్వతారోహణ ఔత్సాహికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సవాళ్లతో సంబంధం లేకుండా వారి కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేసే వ్యక్తుల అసాధారణ సామర్థ్యాలను సమాజానికి చాటి చెప్పారు.
ఈ ఏడాది డిసెంబరులో అంటార్కిటికా, వచ్చే ఏడాది వేసవిలో నార్త్ అమెరికాలో పర్వతారోహణకు ప్రణాళిక రూపొందించుకున్నట్టు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కంది తెలిపారు.
Report: Gantla Rajireddy-News Reporter,Navabhoomi,Serilingampally,Hyderabad