రిలింగంపల్లి-నవభూమి ప్రతినిధి: తమకు జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని జియో వెరిమాక్స్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. శుక్రవారం మాదాపూర్ లోని సంస్థ కార్యాలయం ముందు పలువురు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. వెంటనే జీతాలు చెల్లించి తమ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పనిచేస్తున్న 1200 మంది ఉద్యోగులు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ సంస్థకు వెరిమాక్స్ సంస్థ కాంట్రాక్ట్ కింద టెలికాం టవర్ మెయింటెనెన్స్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నా సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మొరపెట్టుకున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నా తమకు భద్రతా పరికరాలు కూడా సమకూర్చకుండా తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జీతాలు ఇవ్వమని కోరితే తమను వెరిమాక్స్ యాజమాన్యం బెదిరింపులకు గురి చేస్తుందని తెలిపారు. పిఎఫ్, ఇతర అలవెన్సులు కూడా చెల్లించడం లేదని చెప్పారు. వెంటనే జీతాలు చెల్లించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.