ODI WC 2023 : ఐపీఎల్ ఫీవర్ ముగిసిన వెంటనే దేశంలో వరల్డ్ కప్(Worlcup) మజా మొదలు కానుంది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలలో జరగనున్న ప్రపంచ కప్ కు 12సంవత్సరాల తర్వాత భారత్ ఆతిధ్యమివ్వనుంది. వరల్డ్ కప్ లో మొత్తం 48 మ్యాచులు జరగనున్నాయి. దీంతో ఈ టోర్నీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీసీఐ(BCCI).. మ్యాచులు జరిగే స్టేడియాల లుక్ ను మార్చనుంది. ఇందుకోసం రూ.500కోట్లను కేటాయించింది.
మొత్తం ఐదు స్టేడియాల రూపురేఖలు మార్చేలా కసరత్తు ప్రారంభించింది. ఢిల్లీతో పాటు హైదరాబాద్, కోల్ కతా, మొహాలి, ముంబైలోని వాంఖడే స్టేడియాల్లో వసతులను మెరుగుపర్చనుంది. ఈసారి వరల్డ్ కప్ కు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం కూడా ఆతిథ్యం ఇవ్వనుండడంపై తెలుగు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ స్టేడియం మరమ్మత్తులకు రూ.117.17కోట్లు కేటాయించింది. ఢిల్లీ స్టేడియానికి రూ. 100 కోట్లు, కోత్ కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియం కోసం రూ.127.47 కోట్లు, మొహాలీలోని పీసీఏ స్టేడియానికి రూ.79.46 కోట్లు, వాంఖడే స్టేడియం కోసం రూ. 78.82 కోట్లు ఖర్చు పెట్టనుంది. కాగా చివరి సారిగా భారత్ ఆతిథ్యం ఇచ్చిన 2011 వరల్డ్ కప్ ట్రోఫీని ధోని సేన సగర్వంగా ముద్దాడి కోట్లాది మంది భారతీయుల కల నెరవేర్చింది. మళ్లీ 12ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం ఇవ్వనుండడంతో ఈసారి కూడా టీమిండియా ప్రపంచ కప్ టైటిల్ ముద్దాడాలని అభిమానులు కోరుకుంటున్నారు.