అమరావతి`నవభూమిబ్యూరో
ఏపీలో ఎవరూ ఊహించని ఫలితాలు అందర్నీ ముఖ్యంగా వైసీపీని దిగ్భ్రాంతికి గురి చేశాయి. వైనాట్ 175 అని ఆది నుంచి చెబుతూ వచ్చిన వైసీపీకి అదే నెంబర్‌కు దగ్గరలో కూటమి రావడం విస్మయం గొలిపింది. అయితే ఫలితం విషయంలో ఎన్ని సర్వేలు వచ్చినా విశ్లేషకులు మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్‌గా చెప్పారు. జాతీయ మీడియా మొదట్లో వైసీపీ గెలుస్తుందని చెప్పినా,పోలింగ్ తర్వాత ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెప్పినా ఎవరూ నమ్మలేదు. ఫలితాలను చూసి టీడీపీ`ఎన్డీఏ కూటమి నేతలు ఆశ్చరపోయారు. ఇక వైసీపీ పార్టీలో మాత్రం ఈ ఫలితం కలకలం రేపింది. సరే పార్టీ పరాజయానికి కారణాలేమిటి? సాక్షాత్తు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగనే పార్టీ పరాజయానికి కారణాలు అర్థం కావడం లేదని ప్రెస్‌మీట్లో చెప్పుకొచ్చారు. అయితే పార్టీ పరాజయానికి ముఖ్యమైన కారణాలుగా రాజకీయవిశ్లేషకులు చెబుతున్నారు.
1.అభివృద్ధిపై దృష్టి సారించకుండా ప్రతీకార రాజకీయాలకు పాల్పడటం
2.వైసీపీ నేతలు,కార్యకర్తల అరాచకాలు, దౌర్జన్యాలను అధినేతగా పట్టించుకోకపోవడం.ప్రత్యర్థి పార్టీనేతలు,కార్యకర్తలపై కేసులపై కేసులు పెట్టించడం
3.నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం,అలాగే పన్నుల మీద పన్నులేయడం,ఇసుక క్యారీలు చెప్పుచేతల్లో పెట్టుకోవడం.
4.అధికారంలోకి రాగానే మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తానని చెప్పిన జగన్,అధికారంలోకి రాగానే బ్రాండెడ్ మద్యం అమ్మకాలు లేకుండా సొంతంగా మద్యాన్ని అమ్మించడం
5.సచివాలయ సిబ్బందిని గూఢాచారులుగా మార్చి,గ్రామాల్లో ప్రతిఒక్కరి డాటాను సేకరించి, ఎవరు ఏపార్టీలో ఉన్నారో తెలుసుకొని వారికి ప్రభుత్వ పథకాలు,పెన్షన్లు ఇవ్వకుండా నిలిపివేయడం.
6.మామూళ్లు ఇవ్వకపోతే వైసీపీ నేతలు వ్యాపారులను బెదిరించడం,వాటాలు తీసుకోవడం
7.రాజధాని విషయాన్ని ఏమీ తేల్చకుండా ఐదేళ్లు గడిపేయడం
8.ల్యాండ్ టైట్లింగ్ సంబంధించి ప్రజల్లో అలజడి రేగడం,దానికి సర్కారు సరైన వివరణ ఇవ్వకపోవడం
9.ముఖ్యంగా చంద్రబాబును అరెస్టు చేసి 51రోజలు జైల్లో వేయడంతో ప్రజల్లో సానుభూతి పెరిగి,వైసీపీ పట్ల ప్రజాదరణ కోల్పోవడం
10.ప్రజల్లో సానుభూతి కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాల్సింది పోయి, వారిని వేరే ప్రాంతాల్లో పోటీ చేయించడం కూడా వైసీపీ పరాజయానికి కారణాలుగా చెప్పుకోవచ్చు.
అయితే ఉచిత పథకాలు ఇచ్చినంత మాత్రానా ప్రజలు గుడ్డిగా ఓట్లు వేయరని,డబ్బులు ఇచ్చి,తాయిలాలు పంచినా ప్రజలు ఎవరికి ఓటు చేయాలో వారికే చేస్తారని ఏపీ ఎన్నికలు తేల్చి చెబుతున్నాయి.