న్యూదిల్లీ`నవభూమిబ్యూరో
మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అధిష్టానం బుజ్జగింపులతో మెత్తబడ్డారు. జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలో చేరికపై అలకబూనిన జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని కరాఖండిగా చెప్పడంతో చివరికి అధిష్టానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దిల్లీకి పిలిపించి, రాష్ట్ర వ్యవహారాల పరిశీలకురాలు దీపా దాస్ మున్షీతో పాటు సీఎం,మంత్రులతో మంతనాలు జరిపి, జీవన్‌రెడ్డి అలక తీర్చినట్లు వినిపిస్తోంది. ఈ సందర్భంగా సంజయ్ చేరికను ముందు చెప్పకపోవడం తప్పేనని, ఇకపై అలా జరగదని సీఎం రేవంత్ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కేసీఆర్,కేటీఆర్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం బలోపేతానికే చేరికలను ప్రోత్సహిస్తున్నామని,ఇందులో దురుద్దేశ్యం లేదని రేవంత్ వివరణ ఇచ్చినట్లు వినిపిస్తోంది. దాంతో జీవన్‌రెడ్డి మెత్తబడినట్లు తెలుస్తోంది. అయితే జీవన్‌రెడ్డి సీనియర్‌కా వడంతో ఆయన సేవలను వినియోగించుకోవాలని మంత్రిపదవా..పీసీసీలో కీలక పదవా ఏదో ఒకటి ఖరారు చేయాలని అధిష్టానం సీఎం రేవంత్‌కు సూచించినట్లు వినిపిస్తోంది.