తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అలిగినట్లే ఉన్నారు. దీనికి కారణమేమిటంటే ఖమ్మం పార్లమెంట్ సీటుపై ఎంతో ఆశపెట్టుకున్నారు. తన సతీమణి నందిని ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేయించేందుకు మూడు నెలల నుంచే కసరత్తు మొదలుపెట్టారు. ఆమె ప్రజాహిత కార్యక్రమాల్లో విస్తృతంగా తిరిగి ప్రజలతో మమేకమయ్యారు. ప్రభుత్వంలో భట్టి రెండో స్థానంలో ఉండటం, ఉమ్మడి జిల్లాలో ఉన్న మంత్రుల్లో భట్టికి ప్రభుత్వంలో పట్టు ఉండటంతో నందినికి ఎంపీ సీటు నల్లేరు మీద నడకేనని అందరూ భావించారు. అయతే ఇక్కడ విచిత్రమేమిటంటే ఉమ్మడి జిల్లాలో మరో ఇద్దరు మంత్రులు సైతం తమ రక్త సంబంధీకులకే టిక్కెట్లు కావాలంటూ పట్టుబట్టారు. మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్‌రెడ్డికి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్‌కు ఎంపీ సీటు కావాలంటూ ఆ ఇద్దరూ సీఎం రేవంత్ వద్ద ప్రతిపాదనలిచ్చారు. ఇదే కాకుండా సీనియర్ నేత వీహెచ్ తనకూ ఖమ్మం సీటు కావాలని నానాయాగీ చేశారు.మరో వైపు మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి కూడా ఖమ్మం సీటుపైనే ఆశపెట్టుకున్నారు.రేవంత్ తెలివిగా రేణుకాచౌదరికి రాజ్యసభ సీటు ఇచ్చి, ఆమె అడ్డుతొలిగించుకున్నారు. వీహెచ్‌తో మర్యాదపూర్వకంగా మాట్లాడి,అసంతృప్తిని పోగొట్టారు. మరి ముగ్గురు మంత్రుల్లో ఏ రక్త సంబంధీకుడికి ఖమ్మంసీటు ఇవ్వాలన్నది సీఎం రేవంత్‌కు ఫజిల్‌కా మారింది.
మధ్యేమార్గంగా సీనియర్ కాంగ్రెస్‌నేత, వరంగల్ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డి గుర్తుకువచ్చారు. ఇక్కడ ట్విస్టు ఏమిటంటే రఘురామిరెడ్డి ఇటు సినీహీరో విక్టరీ వెంకటేశ్‌తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియ్యంకుడు. రఘురామిరెడ్డికి వెంటనే ఖమ్మం టిక్కెట్టు ఇచ్చేశారు. అంటే ఒక రకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటే చెల్లింది. కావాలని సీఎం రేవంత్ తన సామాజికవర్గానికి చెందిన వారికే టిక్కెట్టు ఇచ్చారని, పైగా పొంగులేటికే సీఎం మద్దతు తెలిపారన్న భావనలో భట్టి ఉన్నారు. అందుకే రఘురామిరెడ్డి ప్రచార కార్యక్రమాలకు భట్టి దూరంగా ఉన్నారని వినిపిస్తోంది.
అయితే ఇక్కడ మరో ట్విస్టు ఏమిటంటే పొంగులేటి వర్గానికే టిక్కెట్టు దక్కడంపై వినిపిస్తున్న సమాచారమేమిటంటే ఆయన కాంగ్రెస్‌లో చేరేముందు తాను చెప్పిన వ్యక్తికే ఎంపీ సీటు ఇవ్వాలని షరతు విధించారట. ఈ విషయాన్ని అధిష్టానం ముందుంచడంతో రఘురామిరెడ్డికి టిక్కెట్టు ఇచ్చినట్లు రేవంత్,భట్టికి, తుమ్మలకు నచ్చజెప్పారట. అయితే తుమ్మల మాత్రం మల్కాజిగిరి పార్లమెంట్‌కు పార్టీ తరఫున ఇన్‌ఛార్జిగా ఉండి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇక పొంగులేటి రఘురామిరెడ్డిని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఎటొచ్చి భట్టి విక్రమార్క మాత్రమే సైలంట్ అయ్యారని వినిపిస్తోంది.