హైదరాబాద్ జూన్ 5 నవభూమి: ఇప్పుడు ముఖ్యమంత్రి గా ఉన్న రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా ఉన్న నాటి రేవంత్ రెడ్డి కాదు. ఆనాడు ఉన్న క్రేజ్ ఈనాడు కనిపించడం లేదు. ఏదో ఊహించుకున్న రాష్ట్ర ప్రజలకు ఆయనలో అవేమీ కనిపించడం లేదు. ముఖ్యమంత్రి గా రోజు రోజుకు గ్రాఫ్ తగ్గుతూ వస్తుండగా పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయిందనే చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఓటమికి కంకణం కట్టుకున్న బిఆర్ఎస్ పార్టీ వారికి పిలిచి పార్లమెంటు టిక్కెట్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ లో కష్టపడిన సీనియర్ లను కాదని బిఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన ఐదుగురు, బిఎస్పీ నుండి వచ్చిన ఒకరికి ఎంపీ టికెట్ లు ఇచ్చారు. ఓటమిని కొని తెచ్చుకుంటున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ స్వయం కృతాపరాధం వలనే ఓడి పోయారు. ఓడిన వారి వివరాలను చూసి నట్లైతే…,
బిఆర్ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వగా ఓడిపోయారు.
బిఆర్ఎస్ పార్టీ కి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరగానే టికెట్ ఇచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఓడిపోయారు.
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బిఆర్ఎస్ టికెట్ కాదనుకుని కాంగ్రెస్ పార్టీ లో చేరగానే ఆయనకు టికెట్ ఇవ్వగా ఆయన కూడా ఓడిపోయారు.
బిఆర్ఎస్ పార్టీ కి చెందిన మాజీ మంత్రి మహేందర్ రెడ్డి భార్య సునీతా రెడ్డి బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయగా ప్రజలు ఆదరించలేదు, ఓటమి పాలయ్యారు.
పార్లమెంటు ఎన్నికలకు ముందు నీలం మధు బిఎస్పీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరగానే ఆయనకు మెదక్ టికెట్ ఇచ్చారు. ఈయన కూడా ఓటమి పాలయ్యాడు.
వరంగల్ పార్లమెంట్ స్థానంలో మాజీ మంత్రి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కు బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వగా ఈమెకు కాంగ్రెస్ పార్టీ పిలిచి టికెట్ ఇచ్చారు. ఇక్కడ కావ్య కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిచే అవకాశం ఉంది. కడియం కావ్య కు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ తన ఇమేజ్ ను తానే పోగొట్టుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్, తన సిట్టింగ్ ఎంపీ స్థానం మల్కాజిగిరి లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఇక్కడ బిజెపి అభ్యర్థులు గెలుపొందారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలకే కెసిఆర్, జగన్ తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లో ఉన్న సగం మంది మంత్రులు ముఖ్యమంత్రి స్థాయి కలిగిన వారే. అసలే కాంగ్రెస్ పార్టీది సంవత్సరానికి ఒకరిని ముఖ్యమంత్రి ని మార్చే సంస్కృతి అనే పేరుంది. ఇదే అదునుగా చూసి ఇప్పుడు రేవంత్ రెడ్డి ని దించే ఆయుధాన్ని ప్రత్యర్ధులకు ఇచ్చినట్లు అయింది. ఇప్పటికే ఆరు నెలలు అయింది. రేవంత్ రెడ్డిలో ఇదే పోకడ ఉంటే మరో ఆరు నెలల తర్వాత ముఖ్యమంత్రి పదవికి కష్ట కాలాలే. ఎవరి తప్పులు వారికి తెలియవు. ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకుని, సద్విమర్శగా స్వీకరించి, జరుగుతున్న తప్పులను సరిచేసుకుంటే మంచిది.
Report: Thummalapally prasad,Navabhoomi Beauro Chief