Site icon Navabhoomi Telugu News

టీపీసీసీ పీఠంపై సీతక్క?

seethakka

హైదరాబాద్‌ నవభూమిబ్యూరో:ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పీసీసీ పీఠాన్ని వీడాల్సిన సమయం దగ్గరపడిరది. జోడు పదవులకు కాంగ్రెస్‌లో అవకాశం లేదు కనుక,అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి,సీఎం పదవి చేపట్టగానే పీసీసీ అధ్యక్షుని పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాల్సి ఉండె. కానీ లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రేవంత్‌ అభ్యర్థన మేరకు ఎన్నికలయ్యే వరకు టీపీసీసీ అధ్యక్ష పదవిని కొనసాగించారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో స్టార్‌ కాంపైనర్‌గా రేవంత్‌ అన్నీ తానై అయి ప్రచారం చేసి, అభ్యర్థుల్లో నైతికస్థైర్యాన్ని నూరిపోశారు. ఇక రాహుల్‌,ప్రియాంకల ప్రచారం కూడా కలిసి వచ్చింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ఘట్టం పూర్తయ్యింది. ఫలితాలు రావడమే తరువాయి. మరి రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుని పదవికి రెండు మూడు రోజుల్లో రాజీనామా చేస్తారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది సీనియర్లు కాచుకొని కూర్చొన్నారు. మహేశ్వర్‌గౌడ్‌,మధుయాష్కీ,సంపత్‌కుమార్‌,జగ్గారెడ్డి,అద్దంకి దయాకర్‌ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సీఎం రేవంత్‌రెడ్డికి చేదోడువాదోడుగా ఉండే వ్యక్తి కోసం అధిష్టానం అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క అధిష్టానం దృష్టిలో పడ్డారు. ఒక బహిరంగసభలో సీతక్క పేరు వినగానే అభిమానులు చేసిన హడావుడికి సోనియాగాంధీ కూడా ఆశ్చర్యపడ్డారు. అలాగే రాహుల్‌ పాదయాత్రలో సీతక్క తన అనుయాయులతో కలిసి పాల్గొని ఆయన్ను ఆకట్టుకున్నారు. పైగా ఆదివాసీ మహిళ,వివాద రహితురాలు. అందువల్ల ఆమెకు టీపీసీసీ అప్పగించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు పోవాలని అధిష్టానం యోచన. అయితే ఇక్కడ రేవంత్‌ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్లే సీతక్క పేరు తెరపైకి వచ్చిందని వినిపిస్తోంది.వేరేవాళ్లకు ఇస్తే విభేదాలు పెరిగి కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టకు నష్టం కలుగుతుందని,అధిష్టానం ఆలోచించినట్లుగా దిల్లీ నుంచి వినిస్తోంది. అగ్రనేతలు సీతక్క వైపే మొగ్గారు. నేడో రేపో సీతక్క పేరును ఏఐసీసీ ప్రకటించే అవకాశముంది.

Exit mobile version