అమరావతి`నవభూమిబ్యూరో
ఓటమి తర్వాత జగన్‌లో మార్పు వస్తుందని అందరూ భావించారు. అయితే అలాంటి మార్పేమీ కనిపించలేదు కానీ..పాత పోకడలో తిరిగి ఓదార్పు యాత్ర వంటి కార్యక్రమానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సరే ఈ యాత్రతో పాటు ఈవీఎంలపై రాష్ట్రంలో చర్చ లేవదీయాలనే ప్రయత్నంలో జగన్ ఉన్నట్లు వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో 175కు 164 ఎన్డీఏ కూటమి చేజిక్కించుకుంది. జగన్ పార్టీ 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. వైనాట్ 175 నుంచి 11 సీట్లకు దిగజారడాన్ని జగన్ జీర్ణించుకోలేకపలొోతున్నారు. గతంలో 151 సీట్లకు కనీసం వంద సీట్లు వస్తాయని జగన్ అండ్ టీం నిర్థారించుకుంది. నాలుగైదు సొంత సర్వేలు చేసిన తర్వాత మళ్లీ అధికారం ఖాయమన్న భావన జగన్‌లో ఉంది.అయితే దీనికి భిన్నంగా కూటమికి అధికారం రావడం ఏదో మాయ జరిగిందన్న అభిప్రాయం జగన్‌లో ఉంది. కోట్లాది రూపాయలను సంక్షేమం పేరిట ప్రజలకు పంచిన తమ పార్టీ అనామకంగా ఓటమి పాలవ్వడం వెనుక ఏదో కుట్ర ఉందని జగన్ అనుమానిస్తున్నారు. దిల్లీ పెద్దల జోక్యంతోనే ఇలా జరిగిందని ఓటమి తర్వాత మీడియా ఎదుట అనుమానం వ్యక్తం చేశారు. తమ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదని,తమకు వచ్చిన 40శాతం ఓట్లే దీనికి ఉదాహరణగా జగన్ చెబుతూ వస్తున్నారు. అందుకే జగన్ ఈవీఎంల విశ్వసనీయతపై చర్చకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతా బాగానే ఉంది.. గత ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. చంద్రబాబు పసుపు కుంకుమ పేరిట మహిళలకు నగదు అకౌంట్లలో వేసిన తర్వాత ఆయన పార్టీ పరాజయం పాలైంది. అప్పట్లో జగన్‌కు అంత గొప్ప మెజార్టీ వచ్చిన తర్వాత ఇలాంటి అనుమానాలే చాలామంది వ్యక్తం చేశారు. దీనిపై కూడా చర్చ జరగాలని కూటమి నేతలు అంటే..పరిస్థితి ఏమిటి? గత ఎన్నికల్లో వైసీపీ 49.95శాతం ఓట్లు తెచ్చుకుంది. మరి టీడీపీ సింగిల్‌గా 39.17శాతం ఓట్లు తెచ్చుకుంది. అంటే టీడీపీకి 40శాతం ఓట్లు వచ్చినట్లే. అయినప్పటీ ఘోరంగా ఓడిపోయింది. మరి వైసీపీ భారీ మెజార్టీ తెచ్చుకోవడంపై అప్పట్లో ఇలాంటి అనుమానాలు వచ్చి ఉంటాయిగా..