అటు దేశంలోనూ ఇటు ఏపీలోనూ ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యాయని చెప్పొచ్చు. ఏ బార్ చార్‌సౌ అంటూ నినదించిన బీజేపీ`ఎన్డీఏ కూటమికి మేజిక్ ఫిగర్ దోబూచులాడుతోంది. నిన్నటి వరకూ వైనాట్ 175 అంటూ నేతలను పరుగులు పెట్టించిన ఏపీ సీఎం,వైసీపీ నేత జగన్‌రెడ్డి వచ్చిన ఫలితానికి బిత్తరపోయి ఎలా జరిగింది..మహిళలు,వృద్ధుల ఓట్లు ఎటువెళ్లాయోనని బెంగపెట్టుకున్నారు.
ఓట్ల సునామీ ఏపీలో వచ్చింది. ఉదయం 8 గంటల నుంచే సైకిల్ పరుగులు తీసింది. క్షణక్షణానికి లీడిరగ్ పెరుగుతూ వైసీపీని బెంబేలెత్తించింది. వాస్తవానికి ఇంత మెజార్టీ టీడీపీకి వస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడే ఊహించి ఉండరు. ఇటు వైసీపీ ఈ ఫలితాలను చూసి షాక్ తింది. ఫైర్‌బ్రాండ్ నేతలు,మంత్రులు పరాజయం పాలయ్యారు. చంద్రబాబునాయుడిని రోజూ తిట్టే కొడాలి నాని,వల్లభనేని వంశీ పదిగంటలకే కౌంటింగ్ స్టేషన్ నుంచి వెనుదిరిగారు.
సాయంత్రం 7గంటల వరకు టీడీపీ 135 సీట్లు గెల్చుకోగా ఒక సీటులో ఆధిక్యత కనబర్చింది. ఎర్రగొండపాలెం సీటులో చిన్న రగడ జరగడంతో ఈ ఫలితం ఆపేశారు. అయినా అక్కడ కూడా టీడీపీదే ఆధిక్యత..అంటే 136 సీట్లు టీడీపీ ఒక్కటే గెల్చుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో 12 సీట్లు గెల్చుకోగా,నాలుగింటిలో ఆధిక్యత కనబరుస్తుంది.
అధికార పార్టీ తొమ్మిదింటిని గెల్చుకోగా ఒక సీటులో ఆధిక్యత కనబరుస్తుంది. టీడీపీ మిత్రపక్షమైన జనసేన పోటీ చేసిన 21 స్థానాలు,రెండు పార్లమెంట్ సీట్లు గెల్చుకుంది. ఇక బీజేపీ 8 అసెంబ్లీ,2 పార్లమెంట్ గెల్చుకుంది,
ఈ గెలుపు రికార్డులను బద్ధలు కొట్టింది. విభక్త ఏపీలో ఇంత మెజార్టీ రావడం కూటమిగా ఇదే ప్రధమం.ఇక చంద్రబాబునాయుడు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా రికార్డు సాధించబోతున్నారు. ఉరవకొండలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ ఓటమి పాలవుతుందనే సెంటిమెంట్ ఉంది. అయితే ఈసారి అక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచినా ఆ పార్టీ అధికారంలో వచ్చింది.
ఫైర్‌బ్రాండ్లు అంబటి రాంబాబు,రోజా,విడుదల రజనీ ఇలా కేబినెట్ మంత్రులు ఒకరు తప్ప(పెద్దిరెడ్డి) పరాజయం పాలయ్యారు. పులివెందులలో పోటీ చేసిన జగన్‌కు గతం కంటే 30వేల మెజార్టీ తగ్గింది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేసి,గవర్నర్‌కు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అన్ని వర్గాలకు మేలు చేశానని, ముఖ్యంగా మహిళలు,వృద్ధులు వైసీపీకి ఓట్లు వేశారని, ఈ ఓట్లు ఎటు వెళ్లాయో అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. అయితే బాధ్యతాయుత ప్రతిపక్షంగా సభలో వ్యవహరిస్తామన్నారు.
టీడీపీ సంబరాలు మిన్నంటాయి. గతంలో గ్రామ సచివాలయాలకు వైసీపీ ప్రభుత్వం వేసిన నీలిరంగును టీడీపీ కార్యకర్తలు తొలగిస్తూ పచ్చరంగు పులిమారు.