అక్షరయోధుడు రామోజీరావు కన్నుమూత

ఆయన అక్షర శిల్పి. సామాన్యుడిగా వచ్చి అసమాన్యుడిగా ఎదిగారు. ఆయన అడుగుపెట్టని రంగం లేదు. ఏ రంగంలో అడుగుపెట్టినా విజయఢంకాను మోగించారు. అశేష జనావళికి స్ఫూర్తిదాయకంగా మారారు. ఆయనే చెరుకూరి రామోజీరావు. అనారోగ్యంతో శనివారం తెల్లవారు జామున రామోజీరావు(87) కన్నుమూశారు.
కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని పెద్దపరుపూడిలో 1936 నవంబర్‌ 16న రైతు కుటుంబంలో జన్మించిన జన్మించిన రామోజీరావు(రామయ్య) ఎస్సెస్సెల్సీ,ఇంటర్‌,డిగ్రీని గుడివాడలో చదివి,రైసుమిల్లు వ్యాపారంలో అడుగుపెట్టారు. 1961 ఆగస్టు 19న పెనమలూరుకు చెందిన తాతినేని రమాదేవిని వివాహమాడారు. పెళ్లి తర్వాత దిల్లీలో ఉద్యోగం చేసేందుకు వెళ్లారు. 1962లో పెద్ద కుమారుడు కిరణ్‌ పుట్టిన తర్వాత
మిత్రుల సహాయంతో హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌ కేంద్రంగా మార్గదర్శి చిట్‌ఫండ్‌ను స్థాపించారు. అనతికాలంలోనే చిట్‌ఫండ్స్‌ వ్యాపారాన్ని నాలుగురాష్ట్రాల్లో నలుదిశలా వ్యాపించజేశారు. 1969లో రైతుల కోసం అన్నదాత మాసపత్రికను స్థాపించారు. మార్గదర్శి ప్రచారం కోసం కిరణ్‌ యాడ్స్‌ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ గుర్తింపు పొందిన తొలి యాడ్‌ ఏజెన్సీ ఇదే.
మార్గదర్శి కార్యాలయాన్ని విశాఖపట్నంలో ప్రారంభించిన తర్వాత అక్కడే డాల్ఫిన్‌ పేరిన హోటల్‌ను ప్రారంభించి హోటల్‌ రంగంలోకి అడుగుపెట్టారు.
1974లో పత్రికారంగం వైపు దృష్టి పెట్టారు. ఆగస్టు పదిన విశాఖ కేంద్రంగా ‘ఈనాడు’ దినపత్రికను స్థాపించారు. ఆ తర్వాత 1975లో ఈనాడు రెండో ఎడిషన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించి ఒక్కసారే యాభైవేల సర్క్యులేషన్‌ పెంచి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత నాలుగేళ్లల్లో లక్ష కాపీలకు పెరిగింది.
ఈనాడు దినపత్రిక సంచలనాలకు కేంద్రబిందువైంది.స్థానిక వార్తలకు ప్రాధాన్యతమిస్తూ టాబ్లాయిడ్‌ పేరిట జిల్లా అనుబంధాలను ప్రచురించి,గ్రామీణులకు మరింత చేరువయ్యారు. అలాగే ఆదివారంనాడు ప్రత్యేక అనుబంధం ఇచ్చి,అన్ని వర్గాలకు పత్రికను చేరువ చేశారు. మెరికల్లాంటి జర్నలిస్టులను తయారు చేయడానికి ఈనాడు జర్నలిజం స్కూలు నెలకొల్పారు. సాహిత్యానికి ప్రాధాన్యతమిస్తూ చతుర,విపుల పత్రికలను కూడా ప్రారంభించారు.
సినిమా రంగంలో కూడా అడుగుపెట్టి, విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఉషా కిరణ్‌ మూవీస్‌,చిత్ర పంపిణీ కోసం మయూరి డిస్ట్రిబ్యూటర్స్‌ను నెలకొని కొత్త నిర్మాతలకు బాసటగా నిలిచారు. ఇప్పటి వరకు ఉషా కిరణ్‌ మూవీస్‌పై 90 సినిమాలు నిర్మించారు.
ఆ తర్వాత అప్పుడే టీవీ ప్రసారమాధ్యమాలు మొదలవ్వడంతో ఆ రంగంపై కూడా దృష్టి పెట్టి 1995 ఏప్రిల్‌లో ఈటీవీని ప్రారంభించారు. దివంగత ఎన్టీఆర్‌ చనిపోయిన సమయంలో ఈటీవీ ప్రారంభం కాకముందే లైవ్‌లో ప్రసారం చేసి,తెలుగుప్రజలకు మరింత చేరువయ్యింది ఈటీవీ.ఇప్పుడు ఈటీవీ పలుభాషల్లో రావడమేకాకుండా తెలుగులో వివిధ కేటగిరిల్లో కూడా ఛానళ్లను పెట్టారు. ఇక కళాంజలి పేరిట కళాఖండాలు, ప్రియా పచ్చళ్లు..ఇలా ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం సాధించడమే ఆయన ప్రధాన లక్ష్యం.
ఇలాంటి సమయంలో ఫిల్మ్‌సిటిని స్థాపించి, సినిమారంగానికి సంబంధించిన అన్ని వసతులు ఒకే చోట ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచనతో రామోజీ ఫిల్మ్‌సిటిని నిర్మించారు. 1,666 ఎకరాల్లో ప్రపంచంలోనే అత్యంత భారీ స్టూడియోను 1996లో ప్రారంభించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్ట్‌ రికార్డ్స్‌లో చోటు చేసుకున్నారు.
అవినీతిలో కూరుకుపోయిన అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సహా పెకలించాలన్న లక్ష్యంతో అప్పట్లో టీడీపీని స్థాపించిన ఎన్టీరామారావుకు రామోజీరావు బాసటగా నిలిచారు. రాజకీయాల్లో కీలకపాత్ర పోషించినప్పటికీ రాజకీయాల్లో పదవులకు ఆశపడలేదు.సారా వ్యతిరేక ఉద్యమం చేపట్టి తెలుగుప్రజలను జాగృతం చేశారు. అలాగే సంపూర్ణ మద్యపాన నిషేధం విధించేంత వరకు ఆయన నిద్రపోలేదు.
చెరువులు,కుంటల్లో పూడిక తీసేందుకు ఉద్యమాన్ని నడిపారు. అలాగే ఆర్టీఏ చట్టం అమలు కోసం ముందడుగు పేజీ నడిపి,ప్రజల్లో అవగాహన కలిగించారు.
వయోభారంతో కొన్నాళ్లపాటు ఈనాడు డైలీ నిర్వహణకు దూరంగా ఉంటూ రామోజీ ఫిల్మ్‌సిటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏపీలో గత ప్రభుత్వం మార్గదర్శి వ్యవహారంలో కేసులు పెట్టడంతో ఆయన మనస్థాపానికి గురయ్యారు. దీనికి తోడు అనారోగ్యం వేధిస్తుండటంతో ఆయన పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. శనివారం తెల్లవారు జామున శ్వాస అడక కన్నుమూశారు